<no title>‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.

'దిశ'పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.


జోధ్‌పూర్‌: హైదరాబాద్‌లో 'దిశ' ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా స్పందించారు. 'దిశ' హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంది. మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్‌లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్‌ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను కలవనున్నట్లు ఆమె చెప్పారు.



ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్‌ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్‌ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెను​కడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. 'దిశ' హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్‌ లక్ష్యమన్నారు.